అధికార వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. కొడాలి నానివి ఒళ్లు కొవ్వెక్కిన వ్యాఖ్యలంటూ ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. పైగా, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి నాని చేసిన విమర్శలపై దేవినేని ఉమ స్పందించారు. యేడాదిన్నరలో జగన్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయి తన అసమర్థతను, చేతగానితనాన్ని ప్రతిపక్షంపై నెట్టాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాస్త ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తాయన్న సీఎం వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయన్నారు.
పేదల సెంటు పట్టా భూమి పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా ప్రజల సొమ్ము తినేశారన్నారు. తూర్పు గోదావరి ఆవ భూముల్లో రూ.500 కోట్ల వరకు స్వాహా చేశారన్నారు. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని ఆరోపించారు.
అటవీ భూములు, పాఠశాలల స్థలాలు, చెరువులు, కొండలు, గుట్టలు, శ్మశానాలు, అసైన్డ్, ముంపు ప్రాంతాల్లో భూములను పేదలకు ఇస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాల కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెబుతున్నారు.. అందులోను రూ.3 వేల కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఈ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జగన్ స్పందించలేదన్నారు.
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఒళ్లు కొవ్వొక్కి అనుచిత వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని చెప్పుకొచ్చారు.