టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ న్యాయవాదుల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. అంతేగాకుండా బాబు అరెస్ట్‌పై ఆ పార్టీ వర్గాలు న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి.
అలాగే విజయవాడ చేరిన టీడీపీ న్యాయవాదుల బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ అందజేశారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయం అయిందని టీడీపీ న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. వయసు, ఆరోగ్య రీత్యా అరెస్ట్ చేసిన 24 గంటల్లో చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. గరికపాడు వద్ద పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి ఆటంకం ఎదురుకావడంతో వాహనం దిగి కాలినడకన మంగళగిరి బయల్దేరారు.
అయినప్పటికీ పోలీసులు పవన్‌ను అడ్డుకున్నారు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నంచడంతో పవన్ రోడ్డుపై పడుకున్నారు. పవన్‌ను తిరిగి హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.