భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కోట్లాది మంది భారతీయులు కొలిచే శ్రీ రాముడు ఓ నేపాలీ అని, ఆయన సతీమణి సీత కూడా తమ దేశ అమ్మాయేనని నేపాల్ ప్రధాని శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పుకునే అయోధ్య... తమ దేశంలోనే ఉందన్నారు.
అయితే శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. శ్రీరాముని జన్మస్థలం గురించి తెలిసీ తెలియని మాటలు సరికాదని పేర్కొన్నారు.
రాముడు భారతదేశంలో జన్మించాడనేందుకు ఎన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయని వాటిని వక్రీకరించడం సబబు కాదని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణమన్నారు.
ఇకనైనా నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. భారత్‌లో జన్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమన్నారు. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని కొనియాడారు.