Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండేళ్ళ త‌ర్వాత పొన్న‌వ‌రం స్వ‌గ్రామానికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

రెండేళ్ళ త‌ర్వాత పొన్న‌వ‌రం స్వ‌గ్రామానికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:57 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తమ సొంత గ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో పర్యటిస్తున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా సొంతూరుకు వస్తున్న జస్టిస్‌ వెంకటరమణకు ఘనంగా స్వాగతం పలికేందుకు గ్రామస్థులు భారీగా ఏర్పాట్లు చేశారు.


రెండేళ్ల క్రితం ఆయన పొన్నవరం వచ్చారు. గ్రామంలో నేడు పౌర సన్మానం జరగనుండటంతో తోరణాలు, ఫ్లెక్సీలతో గ్రామాన్ని అలంకరించారు. గ్రామంలో దాదాపు నాలుగు గంటలసేపు ఆయన గడపనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ కంచికచర్లలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఇక్కడే ఉంటున్న పెదనాన్న కుమారుడు వీరనారాయణ నివాసంలోనే భోజనం ఏర్పాట్లు చేశారు. సీజె ర‌మ‌ణ కార్యక్రమాల ఏర్పాట్లను  సీఎం కార్యక్రమాల సమన్వయకర్త రఘురామ్‌, డీఐజీ మోహనరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పరిశీలిస్తున్నారు.
 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేటి ఈ నెల 26 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ర‌మ‌ణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి పొన్నవరం చేరుకుంటారు.  అక్కడ శివాలయంలో పూజ చేసి, అనంతరం పౌర సన్మానం స్వీకరిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం విజయవాడ చేరుకుంటారు. అంతకుముందు జిల్లా సరిహద్దు గరికపాడువద్ద కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్వాగతం పలికి సాదరంగా జిల్లాలోకి ఆహ్వానిస్తారు. హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పెరికలపాడు క్రాస్‌రోడ్డు నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న పొన్నవరానికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
 
ఈ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా చందోలు గ్రామ ఆలయంలో పూజలు చేసిన అనంతరం పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. తిరిగి విజయవాడ చేరుకుని రాత్రికి నోవాటెల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. హోటల్‌లో సందర్శకులను కలుస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మానం స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు. ఆదివారం ఉదయం విజయవాడ కానూరులో సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాసం ఇస్తారు. ఉదయం 11 గంటలకు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే జ్యుడీషియల్‌ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు. 
 
 
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 460 మంది న్యాయాధికారులు పాల్గొంటారు. సత్వర న్యాయం అందించడం, కేసుల పెండెన్సీని తగ్గించడం ఈ సమావేశాల నిర్వహణ ముఖ్య ఉద్దేశం.  న్యాయ సంబంధమైన ఆలోచనా విధానాలను న్యాయాధికారులు ఒకే వేదికపై పంచుకోవాలన్నది ఈ సదస్సు ఉద్దేశమని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం గుంటుపల్లిలో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత కంచికచర్ల చేరుకుని అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్‌ వెళతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలవంత మత మార్పిడులకు పాల్పడితే ఐదేళ్ళ జైలు