టిటిడి త్వరలో నిర్వహించనున్న కల్యాణమస్తు, శ్రీనివాస కల్యాణాలు లాంటి ధర్మప్రచార కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు తమవంతు సహకారం అందించి సేవలందించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు.
తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో మంగళవారం ఆయన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. రథసప్తమి పర్వదినం నాడు విశేషంగా సేవలందించారని అభినందించారు. అదనపు ఈవో మాట్లాడుతూ టిటిడి మహాయజ్ఞంలా తలపెట్టిన అనేక హైందవ ధార్మిక కార్యక్రమాల్లో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్న సంకల్పంతో ఉందన్నారు.
ఇటీవల కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన, వైజాగ్‌లో కార్తీక సహస్ర దీపోత్సవం, నెల్లూరులో వసంత పంచమి సరస్వతి పూజ, తిరుమలలో జరిగిన రథసప్తమి కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలందించారని కొనియాడారు.
స్వామివారికి భక్తులంటే ఎనలేని ప్రేమ అని, పురాణాల్లోని ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం ఘట్టాలు దీన్ని నిరూపిస్తున్నాయని చెప్పారు.
పవిత్రమైన తిరుమలలో వారం రోజుల పాటు బస చేసి స్వామివారికి ప్రియమైన భక్తులకు సేవలందించడం శ్రీవారి సేవకుల పూర్వజన్మ పుణ్యఫలమన్నారు. సేవకులు తమ ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి అనుభవాలు, వసతులను తెలియజేసి మరింత మంది శ్రీవారి సేవకు వచ్చేలా కృషి చేయాలని కోరారు.