ప్రభుత్వ అనుమతి మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ప్రారంభిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివి ఎస్ ఓ గోపినాథ్ జెట్టి, సిఈ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటి ఈఓ హరీంద్రనాథ్ ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఈవో అన్నమయ్య భవన్ ఎదుట తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు దాదాపు 75 రోజులుగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశామన్నారు.
ఆలయంలో స్వామివారి కైంకర్యాలు ఆగమోక్తంగా అర్చకస్వాములు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిమేరకు ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ జూన్ 8వ తేదీ నుండి తిరుమలలో ప్రయోగాత్మకంగా దర్శనం ప్రారంభిచాలని నిర్ణయించామన్నారు.
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తాను, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించామని, అధికారుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని అనేక సూచనలు ఇచ్చామన్నారు.
తిరుమలకు విచ్చేసే భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలి, రవాణా, వసతి, లడ్డూ ప్రసాదాలు, తలనీలాల సమర్పణ, శానిటైజేషన్ తదితర అంశాలపై విభాగాల వారిగా అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
భౌతికదూరం పాటిస్తూ గంటకి ఎంతమందికి దర్శనం కల్పించవచ్చు, భక్తులు తీసుకోవాలసిన జాగ్రత్తలు తదితర అంశాలను అధికారులతో చర్చించామన్నారు.