కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఆఖరికి ఛాయ్ తాగాలంటే కూడా జనాలు జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు చెక్ పెట్టే ఛాయ్‌ని అమ్ముతున్నాడు.. హన్మకొండలోని ఓ హోటల్ యజమాని. వేడి వేడి ఈ టీతో కస్టమర్లను లాగేస్తున్నాడు.
ఈ చాయ్ తాగడం వలన గొంతులో ఉపశమనం కలుగుతుందని ఓరుగల్లు వాసులు చెబుతున్నారు. గతంలో 50 చాయ్‌లు అమ్మడం గగనమయ్యేదని.. కాని ఇప్పుడు రోజుకు దాదాపు 600 స్పెషల్ చాయ్‌లు అమ్ముతున్నట్టు హోటల్ యజమాని చెబుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని రామ్‌నగర్‌లో చిరుధాన్యాలతో తయారు చేసే టిఫిన్లు విక్రయించే ధ్యాన ప్రకృతి మందిరమిది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ చేసే చాయ్‌కు డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ అమ్మేది కరోనా స్పెషల్ చాయ్ కాబట్టి.
కరోనా వైరస్ దరిచేరకుండా ఇప్పుడు అందరూ కషాయం తాగుతున్నారు. ఇదే తన వ్యాపార సూత్రంగా మలచుకుని అల్లం, మిరియాలు, శొంఠి, దాల్చినచెక్కతో తయారు చేసిన వేడివేడి టీతో ఇక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాడు ఈ వ్యాపారి.
ఒక్కో ఛాయ్‌ను రూ.10ల చొప్పున విక్రయిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉపాధి పొందుతున్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రతతో చాయ్‌ను తయారు చేస్తున్నానని యజమాని చెప్తున్నాడు.