Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి కృష్ణాజిల్లాలో ‘స్పందన’

నేటి నుంచి కృష్ణాజిల్లాలో ‘స్పందన’
, సోమవారం, 26 జులై 2021 (07:15 IST)
‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం.. అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది.
 
స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే  ఏ ఒక్క పని ముందుకు కదలదు.. స్పందన లోపిస్తే పేద , మధ్య తరగతి ప్రజలు ఎంతో నష్టపోతారు.  గతంలో ప్రతి పనికి జిల్లా, మండల కార్యాలయాల  వరకు వెళ్లాల్సి వచ్చేది.

స్పందనతో ఆ బాధలన్నీ తొలగిపోయాయని ఎందరో తమ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పనైనా చేయిస్తామని అమాయకుల నుండి పైకం వసూలు చేసే పైరవీకారుల ప్రభావం అదృశ్యమైంది. ఎక్కడా..ఏ ఒక్కరికి  రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లాలో ఉన్నతాధికారులు పేర్కొనడంతో స్పందన కార్యక్రమంపై పలువురిలో పెద్ద ఎత్తున ఆశలు చిగురించాయి.  

గత ఏడాది  కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న  నేపథ్యంలో ప్రతి  సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజలు వ్యయప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని నాటి జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ సూచించారు.

దీంతో ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక  నేటి నుంచి కృష్ణాజిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది.  ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన సమస్య  గూర్చి అయినా జిల్లా కలెక్టర్ నేరుగా ముఖాముఖిగా తెలియచేయవచ్చు  లేదా అర్జీ ద్వారా ఆయనకు అందచేసే వెసులుబాటు స్పందన ద్వారా ఒనగూరనుంది.  

ఈ నెల 26న స్పందన కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కృష్ణాజిల్లా  కలెక్టర్  జె. నివాస్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందనను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కొవిడ్ నిబంధనల మేరకు ప్రతిఒక్కరూ మాస్కులు, శానిటైజర్లను వినియోగిస్తూ భౌతికదూరం పాటింబేలా అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 

సోమవారం మచలేపట్నం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం లో జరగబోయే స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని  ప్రజలు తమ సమస్యలను ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అర్జీ రూపంలో అందించాలని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు  కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు.

ఈ అవకాశాన్ని కృష్ణాజిల్లా ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.  సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్లు , వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ ప్రకటన చేయాలి: ఉప రాష్ట్రపతిని కోరిన మాగుంట