Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపాకు ప్రచారం చేసిన మరో ఆరుగురు వాలంటీర్లపై వేటు

Advertiesment
andhra pradesh map

వరుణ్

, శుక్రవారం, 29 మార్చి 2024 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు ప్రచారం చేస్తున్న మరో ఆరుగురు వాలంటీర్లపై ఎన్నికల సంఘం వేటువేసింది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించారు. టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి సంతబొమ్మాళిలో వాలంటీర్లు కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్ ప్రచారంలో పాల్గొన్నారు. 
 
దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యకుడు అచ్చెన్నాయుడు సి-విజిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ నూరుల కమర్.. ఆ వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో ఉపాధిహామీ పనుల వద్ద వాలంటీర్లు మల్ల అశ్విని, బొడ్డ శ్రీలత వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు సివిజిల్‌కు ఫిర్యాదు అందిందని ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. 
 
దీనిపై విచారణ చేపట్టి ఆ ఇద్దరినీ విధుల నుంచి తొలగించామన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన గొరకపూడి గోపీనాథ్ ఎన్నికల నోడల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కృష్ణవరంలో వైసీపీ ప్రచారంలో పాల్గొన్నట్టు ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి గోపీనాథ్‌ను సస్పెండ్ చేసినట్టు ఆర్వో శ్రీనివాస్ తెలిపారు. 
 
ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం ఎదురాళ్లపాడు పంచాయతీ పరిధి కొత్తపల్లి గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో గ్రామానికి చెందిన వలంటీర్లు సంజీవ రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. తర్లుపాడు మండలంలోని పోతలపాడులో గురువారం వైసీపీ ప్రచార కార్యక్రమంలో ఇటీవల సెలవులపై వచ్చిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కొమ్ము రమేశ్ పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మల్లారా.. అక్కల్లారా.. వెళ్లొద్దు.. భోజనాలు కూడా ఉన్నాయ్... విజయసాయికి ఘోర అవమానం!!