విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పొందేందుకు మరో ఉద్యమం తప్పదని సినీ నటుడు శివాజీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకృతి వనరులు తరలించుకుపోతున్న కేంద్రం... ప్రత్యేక హోదా ఇవ్వడంతో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి తాము రోడెక్కాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయన్నారు. అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీని, భాజపాకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తారా? అని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే 13 జిల్లాల్లో పెద్దయెత్తున ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ విషయంలో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ముందుకు రావాలన్నారు. ఆయన రోడ్డుపైకి వస్తేగానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో వణుకు మొదలై ప్రత్యేక హోదాపై ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు.