వార్తల సేకరణకు వచ్చిన బీబీసీ రిపోర్టర్‌ను ఉత్తరకొరియా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అంతేగాక.. ఆ రిపోర్టర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరకొరియాలో 36 ఏళ్ల తర్వాత గత శుక్రవారం అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీని కవరేజీ నిమిత్తం కొందరు నోబెల్ గ్రహీతలతో కలిసి ముగ్గురు సభ్యులతో కూడిన బీబీసీ బృందం కొద్దిరోజుల క్రితమే ఉత్తర కొరియాకు చేరుకుంది.
ఈ సమావేశాలు ముగిసిన తర్వాత బీబీసీ రిపోర్టర్ రుపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేస్‌తో పాటు.. మిగిలిన బృందం సభ్యులు తిరుగుపయనమయ్యారు. కానీ, వీరందరినీ ప్యాంగ్‌యాంగ్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు రుపర్ట్‌ను విచారించినట్లు బీబీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినందుకు రుపర్ట్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.