Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో బోల్తాపడిన జీడిపిక్కల మినీ లారీ.. ఏడుగురు దుర్మరణం

Advertiesment
road accident

ఠాగూర్

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో జీడిపిక్కల మినీ లారీ ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 
 
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లి తిరగబడింది. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు.
 
ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు ఘంటా మధు (తాడిమళ్ల) కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు సుబ్రహ్మణ్యం, శ్రీహరిరావు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‍లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నిర్లక్ష్యం వల్లే బుడమేరులో వరదలు.. చంద్రబాబు ఫైర్