కరోనా రెండో దశ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా వైరస్ సోకుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను నడిపేందుకే మొగ్గు చూపుతోంది.
ఈ క్రమంలో విద్యార్థి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమంతప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను పర్యవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు కొత్తగా వలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది.
ఇందుకోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి.
ప్రతి పాఠశాలకు చెందిన విద్యార్థులంతా క్రమం తప్పకుండా స్కూల్స్‌కు వస్తున్నారా లేదా అన్నది హెచ్ఎంలతో పాటు వలంటీర్లు పర్యవేక్షించాల్సివుంటుంది. విద్యార్థులు పాఠశాలకు హాజరై.. అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నారా?... లేదా అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
అలాగే, ఒక విద్యార్థి వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే... విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. దీంతో వలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం పంపుతారు. తరత్రా కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే 'అమ్మఒడి' పథకం కూడా వర్తించదని తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థుల హాజరును తప్పనిసరి చేసింది.