ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయలకు వేసిన రంగులన్నీ తొలగించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సైతం తాజాగా ఆదేశించింది. అదీ కూడా నాలుగు వారాల్లోగా అంటే నెల రోజుల్లో వైకాపా జెండా రంగులన్నీ తొలగించాలని అపెక్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుకు కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లోగా రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ, ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది.