మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ సీబీఐకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను మృతుని కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రసూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపిన టీఎస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అయితే, హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని, సునీత పిటిషన్‌లో ఏముందో కూడా తమకు తెలియదని, పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇపుడే వాదనలు వినిపించేవాళ్లమని చెప్పారు. అందువల్ల సోమవారం వరకు విచారణను వాయిదా వేసి, ఆ రోజున తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.
ఇప్పటికీ అవినాష్‌కు తాత్కాలిక ఊరట లభించింది. సోమవారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించిన అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం తేలనుంది. మరోవైపు, ఈ కేసులో టీఎస్ హైకోర్టు ఆదేశం మేరకు ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.