Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖను వరించిన 'సాగరమాల', ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖను వరించిన 'సాగరమాల', ఏంటి దీని ప్రత్యేకత?
, మంగళవారం, 9 మార్చి 2021 (09:25 IST)
'సాగరమాల' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో విశాఖపట్నంకు సింహ భాగం దక్కింది.

సాగరమాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మొత్తం 92 రోడ్డు, రైల్‌, పోర్టులు, జెట్టీలు, జల రవాణా అభివృద్ధి ప్రాజెక్ట్‌లలో 40కి పైగా ప్రాజెక్ట్‌లు విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కినట్లుగా పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఇచ్చిన జవాబు ద్వారా స్పష్టం అయింది.

మొత్తం 85 వేల 576 కోట్ల అంచనా వ్యయంతో 92 ప్రాజెక్ట్‌లు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 4,717 కోట్లతో పోర్టు అధునీకరణ కింద 22 ప్రాజెక్ట్‌లు, రోడ్డు, రైలు, జల రవాణా కనెక్టివిటీని పెంచేందుకు 47 వేల 852 కోట్ల వ్యయంతో చేపట్టే 54 ప్రాజెక్ట్‌లు, పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామీకరణను ప్రోత్సహించేందుకు 32 వేల 53 కోట్ల వ్యయంతో చేపట్టే 10 ప్రాజెక్ట్‌లు, కోస్టల్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కింద 952 కోట్ల వ్యయంతో చేపట్టే 6 ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు మంత్రి వివరించారు.

మొత్తం మీద ఆ 92 ప్రాజెక్ట్‌లలో ఇప్పటి వరకు 25 వేల కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినట్లు చెప్పారు. 51 వేల కోట్ల వ్యయం కాగల 29 ప్రాజెక్ట్‌లలో పనులు కొనసాగుతున్నాయి. 8,945 కోట్ల వ్యయం కాగల 35 ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు.

విశాఖ పోర్టు అభివృద్ధి ప్రాజెక్ట్‌లన్నీ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పోర్టుల ఆధునీకరణ కింద శ్రీకాకుళం జిల్లా బారువ, కళింగపట్నం, విశాఖ జిల్లా భీమునిపట్నంలలో ప్రయాణీకుల కోసం తలపెట్టిన జెట్టీ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

2352 కోట్లతో విశాఖపట్నంలోని షీలా నగర్‌ జంక్షన్‌  నుంచి అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి మీదుగా ఎన్‌హెచ్‌ 16కు కలిసేలా రోడ్డు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. అలాగే 138 కోట్ల వ్యయంతో గంగవరం పోర్టు నుంచి అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌ను నాలుగు వరసల బీచ్‌ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

గంగవరం పోర్టు నుంచి గాజువాకలోని ఎన్‌హెచ్‌ 16కు కలిసే నాలుగు వరసల రోడ్డును ఆరు వరసల రోడ్డుగా అభివృద్ధి చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఎన్‌హెచ్‌ 16పై మింది నుంచి నాతయ్యపాలెం వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం, గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టును కలిపేలా నాలుగు వరసల కోస్టల్‌ రోడ్డు ప్రాజెక్ట్‌,  నగరంలోని సీహార్స్‌ జంక్షన్‌ నుంచి డాక్‌ ఏరియాను కలిపేలా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ప్రాజెక్ట్‌ నిర్మాణం పరిశీనలో ఉన్నాయి.

అలాగే నగరంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌, షిప్‌ బిల్డింగ్‌ (సీఈఎంఎస్‌)ను 574 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. 500 కోట్ల వ్యయంతో ఔటర్‌ హార్బర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు నాలుగు వరసల రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వ ఆమోదం లభించిందని తెలిపారు.

కాకినాడలోని హోప్‌ ఐలాండ్‌ను ప్రపంచస్థాయి కోస్టల్‌ ఎకో టూరిజమ్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో 242 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసే ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాజెక్ట్‌పై డీపీఆర్‌ సిద్ధం అవుతోంది.

కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో 2123 కోట్ల వ్యయంతో జీఎంఆర్‌ గ్రూప్‌ కొత్త పోర్టును అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. విజయవాడ వద్ద భవానీ ద్వీపంలో 22 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం తలపెట్టిన జెట్టీ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో సాగరమాల కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్‌ల పనుల పురోగతి గురించి మంత్రి గణాంకాలతో సహా వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశ కేసు జగన్ రెడ్డిపైనే పెట్టాలి: టీడీపీ