Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమా పార్థివదేహం పక్కనే నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయింపుపై లోకేశ్ చర్చలు?

ఒకవైపు భూమా నాగిరెడ్డి పార్థివదేహం. మరోవైపు నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో మంతనాలు జరిపారట. ఇది ప్రస్తుతం కర్నూలు జిల

భూమా పార్థివదేహం పక్కనే నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయింపుపై లోకేశ్ చర్చలు?
, సోమవారం, 13 మార్చి 2017 (15:42 IST)
ఒకవైపు భూమా నాగిరెడ్డి పార్థివదేహం. మరోవైపు నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో మంతనాలు జరిపారట. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలో హల్‌చల్ చేస్తున్న వార్త. 
 
నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి ఆదివార గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. దీంతో భూమా భౌతిక కాయానికి నివాళులు అర్పించి, భూమా కుమార్తెలు అఖిల ప్రియా రెడ్డి (ఎమ్మెల్యే), మౌనికా రెడ్డి, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను ఓదార్చేందుకు నారా లోకేష్ ఆదివారం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. 
 
అనంతరం ఆయన భూమా పార్థివదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుమారుడు, కుమార్తెలను ఓదార్చారు. పిమ్మట, జిల్లా నేతలను వెంటబెట్టుకుని నంద్యాలకు వెళ్లిపోయారట. అక్కడ భూమా నాగిరెడ్డి స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇచ్చి పోటీ చేయిద్దామంటూ ఆరా తీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.  
 
భూమా మృతితో ఆరు నెలల లోపుగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో, సోమవారం నంద్యాలలోని ఓ హోటల్‌లో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. భూమా స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై వీరు చర్చించినట్టు సమాచారం. 
 
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరైనట్టు వినికిడి. 
 
మరోవైపు నంద్యాల స్థానాన్ని భూమా మరో కుమార్తె నాగమౌనికా రెడ్డికి కానీ లేదా భూమా అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి గానీ కేటాయించాలని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారట. ఇంకొందరు మాత్రం నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కేటాయించి, భూమా కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేత.. డబ్బులు లేక ఏటీఎంల వెక్కిరింత