Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే

Advertiesment
రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
, మంగళవారం, 31 డిశెంబరు 2019 (17:43 IST)
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 54 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి.. నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వస్తారు. మరో వైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని నిర్ణయించారు. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు. 
 
ప్రజారవాణా విభాగంగా మారనున్న ఏపీఎస్‌ఆర్టీసీ
ప్రజారవాణాలో 75 సంవత్సరాలకు పైబడి సుధీర్ఘ సేవలందిస్తూ, ప్రయాణీకుల ఆదరాభిమానాలు గెలవడమే కాకుండా, గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న సంస్ధగా ఏపిఎస్‌ఆర్టీసీకి ఘన చరిత్ర ఉంది. ప్రజారవాణాకు పెద్దపీట వేస్తూ, ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ప్రతీరోజూ సుమారుగా 85 లక్షల మందిని గమ్యస్ధానాలకు చేరుస్తూ అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఇక నుండి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో ప్రజారవాణా విభాగంగా మారనున్నది. ప్రజారవాణా విభాగంలో విలీనం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి 

గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్‌ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు.

అలాగే డిస్‌ ఎంగేజ్‌ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి  తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
 
కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 54 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నప్పటికీ, దీనికి తోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 
 
విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు..
సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతిపై పోరులో 'రివర్స్ టెండరింగ్' విజయాలు