Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల వెంకన్న అన్నయ్య కిరీటాలను కొట్టేసారు... విలువ రూ. 50 లక్షలు

Advertiesment
తిరుమల వెంకన్న అన్నయ్య కిరీటాలను కొట్టేసారు... విలువ రూ. 50 లక్షలు
, ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (08:39 IST)
ప్రముఖ ధార్మిక సంస్థ టిటిడి మరోసారి వార్తల్లోకెక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అత్యాధునిక సి.సి. కెమెరా వ్యవస్థతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని బంగారు కిరీటాలను ఎలా దొంగిలించారు, ఎవరు దొంగిలించారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. 
 
కోదండరామస్వామి ఆలయంలో ఆభరణాల గోల్‌మాల్ వ్యవహారం మరువకముందే గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు కనిపించకుండా పోవడం భక్తుల్లో ఆందోళనకు 
దారితీస్తోంది. కిరీటాలు దొంగిలించిన చోటే సి.సి. కెమెరా లేకపోవడంతో టిటిడి విజిలెన్స్, నిఘా అధికారులతో పాటు పోలీసులు ఈ కేసు సవాల్‌గా మారింది. 
 
గోవిందరాజస్వామి. తిరుమల వేంకటేశ్వరస్వామికి స్వయానా అన్నగా పిలుస్తుంటారు. 
తిరుమల శ్రీవారికి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి అంతే ప్రాముఖ్యత ఉంది. గతంలో గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాతనే తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కూడా చాలామంది భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి వస్తుంటారు. 
 
శ్రీక్రిష్ణదేవరాయల కాలంలో ఎన్నో విలువైన ఆభరణాలను గోవిందరాజస్వామికి అందించారన్న ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా ఆలయంలోని కళ్యాణ మండపంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవీలకు అలంకరించే మూడు కిరీటాలు కనిపించకుండా పోయాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో టిటిడి అధికారులు కిరీటాలు కనిపించలేదన్న విషయాన్ని గుర్తించారు. 
 
వెంటనే టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆలయ సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాశం రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిటిడి తిరువాభరణం రిజిస్ట్ర్రర్ ప్రకారం మలయప్పస్వామి కిరీటం 528 గ్రాములు, శ్రీదేవి కిరీటం 408 గ్రాములు, భూదేవి కిరీటం 415 గ్రాములుగా, మొత్తం మూడు కిరీటాలు 1351 గ్రాములుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి విలువను టిటిడి ఉన్నతాధికారులు చెప్పుకున్నా సుమారు 50 లక్షలకు పైగానే ఉండే అవకాశముంది. 
 
గతంలో కూడా కోదండరామస్వామి ఆలయంలో నగలను ఒకపూజారి విక్రయించడం..ఆ కేసు కాస్త ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇంతలో  గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు కనిపించకుండా పోవడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
 
మరోవైపు కిరీటాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆరు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. కిరీటాలు పోయిన సమయంలో విధుల్లో ఉన్న అర్చకులు టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బందిని విచారిస్తున్నారు. నిన్న అర్థరాత్రి వరకు కూడా పోలీసులు ప్రధాన ఆలయ తలుపులు మూసివేసి విచారణ జరిపారు.
 
టిటిడి విజిలెన్స్, నిఘా అధికారులు కూడా సి.సి.ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆలయంలో మొత్తం 12 సి.సి. కెమెరాలు ఉన్నాయని, కిరీటాలను దొంగిలించిన నిందితులును త్వరలో పట్టుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు కనిపించకుండా పోయిన కళ్యాణ మండపం ప్రాంతంలో సి.సి.కెమెరా లేదు. గతంలో ఒక సి.సి.కెమెరా ఉండేది. అయితే అది పనిచేయకుండా పోవడంతో ఆ సి.సి.కెమరాను తొలగించేశారు. దీంతో కిరీటాలను ఎవరు దొంగిలించారో తెలియక తలలు పట్టుకుంటున్నారు టిటిడి విజిలెన్స్, నిఘా అధికారులు. 
 
పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను చర్చనీయాంశంగా మారిన కిరీటాల మాయం కేసును త్వరలో ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. అర్చకులపైనే పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కిరీటం దొంగిలించిన సమయంలో విధుల్లో ఉన్న అర్చకులనే టిటిడి విజిలెన్స్ , నిఘా అధికారులతో పాటు పోలీసులు పదేపదే విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసైన్యాన్ని నడిపేందుకు 300 మంది మహిళలు... పవన్ కల్యాణ్ లిస్ట్