Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోగుల‌కు రూ.5కే విందు... ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ ఆహారామృతం!

రోగుల‌కు రూ.5కే విందు... ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ ఆహారామృతం!
విజయవాడ , శనివారం, 23 అక్టోబరు 2021 (11:21 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సీఎం కేసీయార్ మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయిదు రూపాయలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారమే ప్రారంభించాలని తొలుత నిర్ణయించినా సాంకేతిక కారణాలతో ఒకట్రెండు రోజులు వాయిదా వేసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. దీన్ని గాంధీ, నిలోఫర్‌, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఏదో ఒక చోట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. 
 
ఈ కార్యక్రమానికి ‘కేసీఆర్‌ ఆహారామృతం’, ‘కేసీఆర్‌ భోజనామృతం’, ‘కేసీఆర్‌ అన్నామృతం’ తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ పేర్లలోనే ఒక పేరును ఎంపిక చేస్తారా? మరో కొత్త పేరును ముఖ్యమంత్రి సూచిస్తారా? అనేది ఇప్పటి వరకూ స్పష్టత లేదని పేర్కొన్నాయి. ఈ కార్యక్రమాన్ని తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ఉస్మానియా, నిలోఫర్‌, సరోజినీదేవి, పేట్లబురుజు, గాంధీ, ఎంఎన్‌జే, ఛాతీ ఆసుపత్రి, ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానా, నిమ్స్‌, ఫీవర్‌, టిమ్స్‌, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్‌పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్‌, నాంపల్లి ప్రాంతీయ ఆసుపత్రుల్లో రూ.5కే ఆహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ‘హరే కృష్ణ మూవ్‌మెంట్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. 
 
ఇందులో ఉదయం అల్పాహారాన్ని, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాలను ఒక్కో దాన్ని రూ.5లకు అందజేస్తారు. మొదట హైదరాబాద్‌ పరిధిలోని దవాఖానాల్లో ప్రారంభించి దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకూ దాన్ని విస్తరించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులే కాకుండా ఓపీలో చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు కూడా లబ్ధి పొందుతారని పేర్కొన్నాయి. జీహెచ్‌ఎంసీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం అమలు ద్వారా రోజుకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకు ప్రయోజనం పొందుతారని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయనగరం వైసీపీలో తీవ్ర విషాదం.. అంబటి అనిల్ గుండెపోటుతో మృతి