పల్నాటి పులి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. ఐతే కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులేనంటూ తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. లక్ష రూపాయల కోసం కోడెల ప్రాణాన్ని తీశారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఐతే తెదేపా ఆరోపణలపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులైన చంద్రబాబు నాయుడే కోడెల మృతికి కారణమంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల వల్ల ఇబ్బందిపడ్డవారు కేసులు పెట్టడంతో ఆయన చంద్రబాబు అపాయిట్మెంట్ కోరారనీ, బాబు కనీసం ఆయనకు తలుపులు తీయకుండా తీవ్రంగా అవమానించారంటూ ఆరోపించారు. ఇలా అవమానించడం వల్లే శివప్రసాదరావు ప్రాణాలు తీసుకున్నారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేశారు.
కోడెలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టలేదనీ, బాధితుల ఫిర్యాదులతోనే ఆ కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చారు. కేవలం కోడెల ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఆయన నమ్మిన నాయకుడు మోసం చేశాడనే బాధేననీ, అందువల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు.