Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.లక్ష కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు : చంద్రబాబు

Advertiesment
రూ.లక్ష కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు : చంద్రబాబు
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (10:48 IST)
పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావులో పిరికితనాన్ని డెవలప్ చేసి.. లక్ష రూపాయల కోసం చనిపోయే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం కల్పించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కోడెల తీసుకెళ్లిన ఫర్నీచర్ విలువ లక్షా, రెండు లక్షల రూపాయలు కూడా కాబోదని, అది పాత ఫర్నీచరని, అది తీసుకెళ్లారని, ఆఘమేఘాల మీద కేసులు పెట్టి, లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలని జగన్ చూశారని, అదే కోడెలకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. 
 
తన తండ్రి అధికారంలో ఉన్న వేళ, అంతులేని అవినీతికి పాల్పడి, ప్రతి శుక్రవారమూ కోర్టు కేసులకు అటెండ్ అయ్యే వెళుతున్న జగన్, మచ్చలేని నేతగా ఉన్న కోడెలపై పదేపదే అసత్య ఆరోపణలతో బురద జల్లించి, ఆయన మనస్తాపానికి లోనయ్యేలా చేశారని నిప్పులు చెరిగారు. ఇప్పుడు జగన్, తాను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి, కోర్టు కేసులకు కూడా హాజరు కాబోనని అంటున్నారని విమర్శలు గుప్పించారు. 
 
తన వద్ద ఉన్న ఫర్నీచర్‌ను తీసుకెళ్లాలని కోడెల లెటర్ రాసిన తర్వాత మాత్రమే, కేసులు నమోదు చేశారని, అది కూడా నరసరావుపేట ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే నమోదయ్యాయని, ఏ అధికారీ పెట్టింది కాదని అన్నారు. ఇలా కేసులు పెట్టి, ఓ మనిషిలో పిరికితనాన్ని డెవలప్ చేశారని మండిపడ్డ చంద్రబాబు, చివరకు ఊహించలేని పరిణామం జరిగిందని అన్నారు.
 
పల్నాడు ప్రాంతంలో కోడెల ఎంతో అభివృద్ధి చేశారని, కోటప్పకొండను ఆయన తీర్చిదిద్దిన తీరు అద్భుతమని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కేన్సర్ ఆసుపత్రిని ఆయన నిర్మించారని, అటువంటి వ్యక్తి లక్ష రూపాయల కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో కోడెల అద్దె ఇంట్లోనే ఉంటున్నారన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో కోడెల కుటుంబీకులపై 19 కేసులను జగన్ పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ దళిత యువకుడి సజీవ దహనం