2019 ఎన్నికల్లో పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎలాంటి ఇబ్బంది వుండదని వ్యాఖ్యానించారు.
ముందు పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు విడిపోతే.. అప్పుడు జనసేనతో పొత్తు గురించి తాము ఆలోచిస్తామని రోజా అన్నారు. కానీ ఇప్పటికీ పవన్ టీడీపీతో రహస్య పొత్తును కొనసాగిస్తున్నారని రోజా తెలిపారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ విమర్శలు గుప్పించారు.
అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారని.. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటారని రోజా విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు.. బీజేపీ, పవన్‌తో జతకట్టారని.. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో జోడి కుదుర్చుకున్నారని మండిపడ్డారు.
ఎన్నికల కోసం జతకట్టడం ఆ తర్వాత వారిపైనే బురద జల్లడం చంద్రబాబు నైజమని ఆమె ఆరోపించారు. అబద్ధపు హామీలు, ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.