ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ చేసిన కామెంట్లను రోజా తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నటన అని, అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు, ముందు మీరు నిలకడగా ఉండటం నేర్చుకోండి.
తిరుమలకు కావాల్సింది చిత్తశుద్ధి.. అంతేకానీ స్కిప్టెడ్ ఆక్రోశాలు కాదని ఫైర్ అయ్యారు. ధర్మం గురించి ప్రసంగాలు అందరూ ఇస్తారు. కానీ అసలైన అవసరం వచ్చినప్పుడు దాని కోసం నిలబడే ధైర్యం ఎవరికి ఉంది అన్నదే అసలైన ప్రశ్న. ఆ పరీక్షలో మీరు ప్రతీసారీ విఫలమయ్యారు.
తిరుమల సమస్యలను ఏదో ఒక బోర్డు లేదా కమిటీ పరిష్కరించదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ మాట్లాడే పవిత్రత, ధర్మం పక్షపాత వైఖరిని బయటపెడుతుంది. తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు గానీ, వ్యవస్థలో తీవ్రమైన లోపాలు బయటపడినప్పుడు గానీ మీ నోరు పెగలలేదు.
కానీ, ఎప్పుడైతే చంద్రబాబుకు ఒక రక్షణ కవచం అవసరమవుతుందో, అప్పుడు హఠాత్తుగా మీరు ధర్మం గురించి ప్రవచనాలు మొదలుపెడతారని మండిపడ్డారు. దీన్ని భక్తి అనరు, స్వచ్ఛమైన రాజకీయ నటన అంటారు. మీరు నిజాయతీ గురించి మాట్లాడతారు, కానీ నిజాయతీ అంటే మనకు అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం. మీరు ఆ పని ఎప్పుడూ చేయలేదని రోజా ఏకిపారేశారు.