బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27వ తేదీన తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరం దాటుతుందని వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.