రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ పంజా విసిరింది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురికి పాజిటివ్ సోకింది. ఈ కేసులన్నీ వనస్థలిపురం హుడాసాయికి కాలనీకి చెందినవేనని అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరిలో భార్యాభర్తలతోపాటు 11 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ ఇంట్లోనే పనిచేస్తున్న ఓ మహిళకు చెందిన ఏడాదిన్నర బాబుకూ వైరస్ వ్యాప్తి చెందింది. వీరందరినీ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వరుసగా కేసులు నమోదవుతుండటంతో వనస్థలిపురం వాసులు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. యాక్టివ్ కేసులు తాజా కేసులతో కలుపుకుంటే జిల్లాలో కోరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. వీరిలో నలుగురు మృతి చెందారు.