ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తెలంగాణ వాసికి పెద్ద పీట వేయబోతున్నదా? అవుననే అంటున్నాయి పరిశీలక వర్గాలు. తెలంగాణ వాదులకు జగన్ సర్కార్ అందలం కల్పిస్తున్నదని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆక్షేపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మరో తెలంగాణ వాసిని కీలక పదవిలో నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలం వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరిచిన కె. రామచంద్ర మూర్తిని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది.
జగన్ సర్కార్ లో సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ (నల్లగొండ), కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ (ఖమ్మం), జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ (వరంగల్) నియమితులైన విషయం విదితమే. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించింది.
తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి (ఖమ్మం)కి జగన్ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ వాసులకు ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు జర్నలిస్టు సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారాయి.