తమిళనాడు, ఆంధ్ర్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలను వణికించిన మాండస్ తుఫాను తీరం దాటిన తర్వాత బలపడి, ఉపరితల ఆవర్తన ద్రోణిగా మారింది. దీని ప్రభావం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్నాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించివుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారుతుందని తెలిపింది.
కాగా, ఏపీలో ఆదివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖ, బాపట్లతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల వేలాది ఎకరాల్లోని పంటకు అపార నష్టం వాటిల్లింది.