తమ వద్ద పనిచేసిన కారు డ్రైవర్‌ను హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతలకు కోర్టుల్లో బెయిల్ లంభించిందనీ, అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసి జైల్లో బంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం బెయిల్ రాకపోవడం విచారకరమని వైకాపా రెబెల్ ఎంపీ ఆర్. రఘురామకృష్ణంరాజు అన్నారు.
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టు గురించి జగన్ ఉపయోగించిన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తాను లండన్ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు ఎత్తారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి జగన్ వాడిన భాష బజారు భాషలా ఉందని అన్నారు. జగన్ పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని... ఆయనకు ఇప్పటివరకు బెయిల్ రాకపోవడం తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోందన్నారు.
డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని పార్సిల్ చేసిన అనంతబాబుకు బెయిల్ వచ్చిందని... వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన దర్జాగా పాల్గొంటున్నాడని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి కూడా బెయిల్ దొరికిందని అన్నారు. చంద్రబాబు వంటి నేతకు బెయిల్ రాకపోడం దురదృష్టకరమని ఆర్ఆర్ఆర్ అభిప్రాయపడ్డారు.