తండ్రిని అరెస్టు చేయగానే భార్యా, తల్లిని వదిలేసి లోకేశ్ ఢిల్లీకి పారిపోయాడంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా బంధించారు.
అయితే, చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. అక్కడే కొద్ది రోజుల పాటు ఉన్నారు. అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుస్తూ కోర్టు వ్యవహారాలు చూసుకున్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
తండ్రిని అరెస్టు చేస్తే భార్యాపిల్లలను వదిలి ఢిల్లీకి పారిపోయిన పిరికి బడుద్దాయి అని లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రి అంబటి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా అదే స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. "తండ్రి కోసమేగా వెళ్లింది.. అరగంట కోసం కాదుగా సోంబేరి సారూ" అంటూ కౌంటర్ ఇచ్చారు.