కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరిగింది. ఇందులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25వ ఓట్లను ఒక కట్టగా కట్టేటపుడు అందులో నుంచి ఓ స్లిప్ బయపటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. అందులో 30 యేళ్ల తర్వాత ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అని సదరు ఓటరు అందులో పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా పులివెందులలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ స్థానికులు మాత్రం తమ ఓటు హక్కును ఎన్నడూ ఉపయోగించుకున్న దాఖలాలు లేదు. ప్రజలను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుని ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులో రిగ్గింగ్‌కు పాల్పడుతూ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది. ఇపుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో పులివెందుల ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకున్నారు.
వైఎస్ కంచుకోటలో తెలుగుదేశం జెండా రెపరెపలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదైంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ అందరి అంచనాలను మించిపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పోలుకాగా, వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైకాపా, టీడీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ హేమంత్ రెడ్డి ఏమాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేక చివరకు ధరావత్తును కూడా కోల్పోయారు. జగన్ గడ్డపై టీడీపీ ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైకాపా శ్రేణులు డీలాపడ్డాయి.