యేడాది పాటు ప్రేమించుకున్నాం.. పెళ్లిమాటెత్తగానే దూరంపెట్టింది.. అందుకే...
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన 19 యేళ్ల యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె ప్రియుడేనని తేలింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన 19 యేళ్ల యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె ప్రియుడేనని తేలింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తామిద్దరం ఒక యేడాది పాటు ప్రేమించుకున్నామనీ, పెళ్లి మాటెత్తగానే అసహ్యించుకుందనీ, అందుకే చంపేసినట్టు నిందితుడు సాగర్ వెల్లడించాడు. ఈయన హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
మధురానగర్‌లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బయ్య ఇంట్లో మూడేళ్ళ క్రితం వెంకటలక్ష్మి (19) పనిమనిషిగా చేరింది. అదే ఇంట్లో డ్రైవర్ కమ్ కుక్‌గా పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన హోంగార్డు సాగర్(27)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఒక యేడాది పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, ఇద్దరు కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీన్ని సాకుగా తీసుకున్న వెంకటలక్ష్మీ కూడా సాగర్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అసహ్యించుకుంది.
ఆ తర్వాత అక్కడ పని మానేసి ఏడాదికాలంగా దూరం పెట్టింది. అయితే వెంకటలక్ష్మి ఇంటి చిరునామా తెలుసుకున్న సాగర్... ఆమె ఇంటికి కూడా వెళ్లి గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1.53 గంటలకు వెంకటలక్ష్మిని కలిసేందుకు షాపుకు వెళ్లిన సాగర్... ఇదే విషయాన్ని మరోమారు ప్రస్తావించాడు. తమ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తన వెంటపడవద్దని ప్రాధేయపడింది. అయినా వినకుండా సాగర్ మొండిగా వాదించడంతో వెంకటలక్ష్మి బయటకు వెళ్లిపోవాలని సూచించడంతో ఆగ్రహానికి గురైన సాగర్ ఆమెపై దాడికి దిగాడు.
అంతటితో ఆగకుండా కౌంటర్‌లోపలికి వెళ్లి ఆమెను కిందపడేశాడు. వెంకటలక్ష్మి చాతిపై కూర్చుని బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. ఈ సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు వెంకటలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు అతడిని వెనక్కి తోసేందుకు యత్నించింది. అయినా ఫలితం లేకపోవడంతో కొద్దిసేపటికే ప్రాణాలు వదలింది. ఆ తర్వాత సాగర్ అక్కడినుంచి పారిపోయాడు. ఈ మొత్తం దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ హత్యను మొత్తం 9 నిమిషాల్లోనే ముగించుకుని బయటకు వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.