Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు సాగు చట్టాల రద్దు... గురునాన‌క్ జ‌యంతిన ప్ర‌ధాని మోదీ నిర్ణయం

Advertiesment
prime minister narendra modi
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (10:43 IST)
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతోంది. దీనితో ప్ర‌ధాని మోదీ హ‌ఠాత్తుగా, సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం, మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ కీలక ప్రకటన చేశారు. 
 
 
నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని అన్నారు. ‘‘మా ప్రభుత్వం ఏం చేసినా అది రైతుల కోసమే. ఏం చేస్తున్నా.. అది దేశం కోసమే. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే తీసుకొచ్చాం. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్దిచెప్పలేకపోయాం. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం అని మోదీ ప్ర‌క‌టించారు.
 
 
ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి’’ అని ప్ర‌ధాని మోదీ వెల్లడించారు.

 
‘‘2014లో నేను తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం కల్పించింది. మన దేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉంది. అదే వారికి జీవనోపాధి అని ప్ర‌ధాని వివ‌రించారు.
 
 
 అన్నదాతల కష్టాలను నేను దగ్గరుండి చూశాను. అందుకే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నాం. ఫసల్‌ బీమా యోజన్‌ను మరింత బలోపేతం చేస్తాం. ఇకపై రైతుల సంక్షేమం కోసం మరింత కష్టపడి పనిచేస్తాం’’ అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు : ప్రధాన అనుచరుడు అరెస్టుతో ఉలిక్కిపడిన వైఎస్ అవినాష్