ఒమిక్రాన్ నేపథ్యంలో థియేటర్లు మళ్లీ మూతపడనున్నాయి. మరోవైపు ఆంక్షల కారణంగా జరుగుతున్న తనిఖీల్లో సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి. తాజాగా సినీ టిక్కెట్ ధరలతో థియేటర్లు క్లోజ్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న వి-ఎపిక్ మల్టీప్లెక్స్ థియేటర్‌ను యాజమాన్యం మూసివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడంతో థియేటర్‌ను స్వచ్చంధంగా మూసివేస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్కీన్ ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌లో 640 సీట్ల కెపాసిటీ ఉంది. ప్రేక్షకులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. ఏపీలో బాహుబలి థియేటర్‌గా దీనికి పేరుంది.
ప్రస్తుతం ఇందులో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఆడుతోంది. అయితే టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో చేసేదేమీ లేక థియేటర్‌ను మూసేసింది యాజమాన్యం. మల్టీప్లెక్స్ మూతపడటంతో సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై వీ-ఎపిక్ థియేటర్ ఉంది. సాహో సినిమాతో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీన్ని రామ్ చరణ్ ప్రారంభించారు.