బిల్డింగ్ పీనలైజేషన్ చట్టానికి సంబంధించి (బీపీఎస్) బిల్డర్ల సూచనల మేరకు మార్పులు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అథారిటి (క్రెడాయ్) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న అమరావతి కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీనలైజేషన్ చట్టం గురించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తమకు అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలించడానికి ప్రభుత్వం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. బిల్డర్ల సూచన మేరకు రిజిస్ట్రేషన్ చట్టంలో కొన్ని మార్పులు చేస్తామని అన్నారు. ఇసుక కొరత త్వరలోనే తీరనుందని దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
అందుకు అనుగుణంగా పాత విధానంలో ఇసుకను ఇప్పించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, దీనిపై బిల్డర్లు, కార్మికులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు అవసరమైతే రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా మార్పులు చేస్తామని తెలిపారు. రానున్న పక్షం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బిల్డర్లు, ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
ఆయా నిర్ణయాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటిపై మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, క్రెడాయ్ ఏపీ ఛైర్మన్ ఎ.శివారెడ్డి, అధ్యక్షుడు చిగురుపాటి సుధాకర్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.వి.స్వామి, ఎల్.రాంబాబు, విశాఖపట్నం జోన్ కార్యదర్శి ధర్మేంద్ర, పలువురు క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం క్రెడాయ్ ప్రతినిధులు మంత్రులతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు.