సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి
తీసుకున్నారు. దీంతో ఆయన వద్ద ఒక్క రోజు పాటు విచారణ సాగనుంది. విచారణ నిమిత్తం పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు గుంటూరు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానికి కోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మంగళవారం సీఐడీ పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత పోసానిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి పోసాని వద్ద విచారణ జరుపుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అనుచితంగా, అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే. పైగా, మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ అంశాలపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17కు పైగా కేసులు నమోదైవున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోసానికి సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.