సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబుకు అనంతపురం పోలీసులు నోటీసులు జారీచేశారు. ఆయన ఆదివారం అనంతపురంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం స్థానిక జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రికి రాత్రే ఆ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. దీంతో నాగబాబు చేపట్టిన శ్రమదాన కార్యక్రమాన్ని వాయిదావ వేసుకోవాలని పోలీసులు నోటీసులు పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలను సరిచేయడమే లక్ష్యంగా చేపట్టిన శ్రమదానం కార్యక్రమానికి జనసేన పిలుపునివ్వగా, ఆదివారం అనంతపురం జిల్లాలో నాగబాబు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అధికారులు రాత్రికి రాత్రే చెరువుకట్టలో రోడ్లకు మరమ్మతులు చేయడంతో పోలీసులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.
అయితే తన పర్యటనను రద్దు చేసుకోనని, ముందుగా అనుకున్న ప్రకారం కార్యక్రమానికి హాజరవుతానని, 'తప్పకుండా రోడ్లను సందర్శిస్తాను' అని నాగబాబు ప్రకటించారు. దీంతో అనంతపురంలో నాగబాబు కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.