Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్ సిటీ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ!!

narendra modi

ఠాగూర్

, బుధవారం, 28 ఆగస్టు 2024 (12:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీని నిర్మించనున్నారు. ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్ సిటీ) పనులకు ప్రధాని నరేంద్ర మోజీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబరు మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇది సాధ్యపడకపోతే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని (సెప్టెంబరు 20న) ప్రధాని మోడీ పర్యటన ఉండేలా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఖరారైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లవుతుంది. ప్రధాని రాక వీలుకాకుంటే.. వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 
 
చెన్నై- బెంగళూరు పారిశ్రామికవాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం (2014-19) కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో వాటికి టెండర్లు ఖరారు చేసి, పనులు ముందుకు తీసుకెళ్లడాన్ని జగన్ సర్కారు విస్మరించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిక్ట్) భాగస్వామ్యంతో చేపట్టారు. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు భవిష్యత్తు బాగున్న నేపథ్యంలో క్రిస్ సిటీ, అచ్యుతాపురం సెజ్‌ల్లో ఆ తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ సిటీని మూడు దశల్లో 11,096 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 'క్రిస్ సిటీ' ఏర్పాటుకు జాకబ్స్ ఇంజినీరింగ్ గ్రూప్.. మాస్టర్గాన్, నమూనాలను రూపొందించింది. మూడు దశల్లో 11,095.90 ఎకరాల్లో క్రిస్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 2,134 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,054.6 కోట్లతో ఏపీఐఐసీ రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ జోన్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పని ప్రదేశంలో నివాస ప్రాంతాలు, ఫుడ్ కోర్టు, పని షెడ్లు.. ఇవన్నీ కలిపి ఒక అత్యాధునిక నగరాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో..