పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారుండరు. ఎమ్మెల్యేగా వుండగా నియోజకవర్గంలో ఏ శుభకార్యానికి కాకితో కబురు పంపినా.. చింతమనేని హాజరయ్యేవారు.
అలాంటి చింతమనేని ప్రభాకర్ కుమార్తె పెళ్లి అంటే వచ్చే జనంతో కిటకిటలాడాల్సిందే. కానీ జనవరి 3వ తేదీన జరిగే తన కుమార్తె వివాహానికి ఎవరూ రావద్దని చింతమనేని స్వయంగా కోరుతున్నారు. అదేమిటంటే.. కరోనా నిబంధనలే కారణమంటున్నారు.
తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికతో పాటు అందించిన స్వీటు బాక్సు వెనుక ఆ సందేశాన్ని చింతమనేని ముద్రించారు. నూతన దంపతులను ఆశీర్వదించమని మిమ్ములను ఆహ్వానించాలి అనుకున్నాను.
కానీ కరోనా నిబంధనలు అందుకు ఆటంకంగా ఉన్నాయి. ఆహ్వాన పత్రికలు అందుకున్న వారే కాకుండా… నా అభిమానులు ఇళ్ల నుండే వధూవరులకు ఆశీస్సులు అందజేయాలని చింతమనేని కోరుతున్నారు. గతంలో ఎంతో దూకుడుగా వ్యవహరించిన చింతమనేని ఇంత నిదానంగా మారటానికి కరోనా నిబంధనలే కారణం అయినప్పటికీ.. ఆయన జైలుకు వెళ్లిన అనుభవం కూడా చింతమనేనిలో మార్పుతెచ్చింది.
దూకుడుతనం తగ్గించుకుని సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న చింతమనేని కరోనా సమయంలో కుమార్తె వివాహం ఎందుకు జరుపుతున్నారు. మమ్ములను ఎందుకు రావద్దంటున్నారు.
ఇటీవల కాలంలో ఎన్నెన్నో పెళ్లిళ్లు అట్టహాసంగా జరిగాయి. ఏ ఒక్కరిపై కేసు కూడా నమోదు చేయలేదు. తనపై కేసు నమోదు చేస్తారనే అనుమానంతోనే చింతమనేని తన కుమార్తె వివాహానికి ఈ విధమైన పద్దతిలో ఆహ్వాన పత్రికలు అందజేసి ఉంటారని.. చింతమనేని సన్నిహితులు అంటున్నారు.