2018 బ్యాచ్ కి చెందిన 12 మంది యువ ఐఏఎస్ అధికారుల బృందం శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్థాయి మహిళా సంరక్షణ పోలీస్ మొదలుకొని ఉన్నతస్థాయి అధికారి వరకు ఏ రకంగా పోలీసు వ్య్వస్థ పనిచేస్తుంది, పోలీస్ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళు, రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం సమానంగా ఉంటుందని వాటిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని వెళ్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు, వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై గౌతమ్ సవాంగ్ యువ ఐఏఎస్అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బరోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం విధివిధానాలు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు అమలుచేస్తున్న వీక్లీ ఆఫ్ విధానం, రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పనితీరును యువ ఐఏఎస్ అధికారుల వారికి వివరించారు.
ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. యువ అధికారులపై ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి అని, ప్రశ్నించే మనస్తత్వంతో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ప్రధానంగా అట్టడుగు, బడుగు బలహీనవర్గాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎల్లవేళలా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావంతో ముందుకు సాగాలని, ఐఏఎస్ అధికారుల బృందంలో మహిళలు 50% శాతం ఉండటం అభినందనీయమన్నారు.