పెద్దాపురంలో డిఫరెంట్ పాలిటిక్స్ చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా అధికారం దక్కింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు మున్సిపాలిటీలు కలిగిన నియోజకవర్గం పెద్దాపురం ఒక్కటే. ఇక్కడ.. కాంగ్రెస్ ఆరుసార్లు, టీడీపీ ఆరుసార్లు, సీపీఐ రెండు సార్లు, పీఆర్పీ ఒకసారి గెలిచింది.
గత ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచినా.. పెద్దాపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్పే గెలిచారు. అయితే మున్సిపల్ ఎన్నికల నాటికి.. నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది.
ఇక వైసీపీలో దొరబాబు రాకతో.. పెద్దాపురం వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చిందనడంలో సందేహమే లేదు. ఇప్పుడు.. పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్ కూడా ఆయనే. దాంతో పాటు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. దాంతో.. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా.. గెలవకపోయినా.. అధికారం దక్కింది. ఇప్పుడంతా జనంలో తిరుగుతూ వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు.