శరీరం పెంచడం కాదు.. సమస్యను అర్థం చేసుకోవాలి.. చంద్రబాబుపై పవన్ ట్వీట్!!!
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటామని, ఇందుకు కార్యాచరణను రూపొందిస్తామని, సమస్యకు మూలాలు తెలుసుకుని నివారిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటామని, ఇందుకు కార్యాచరణను రూపొందిస్తామని, సమస్యకు మూలాలు తెలుసుకుని నివారిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వాగతించారు. అదేసమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుపై పవన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. బాడీలు పెంచుకోవడం ముఖ్యం కాదనీ... సమస్యను అర్థం చేసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు.
ఈ సమస్య గురించి అచ్చెన్నాయుడు కంటే.. ముఖ్యమంత్రికే బాగా అర్థమయిందన్నారు. సమస్యను సీఎం తీవ్రంగానే తీసుకున్నారని, కార్యాచరణను అమలు చేస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. కిడ్నీ బాధితుల పక్షాని నిలిచి చేసిన పోరాటానికి తొలి విజయం లభించిందని.. మున్ముందు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సమస్య సంపూర్ణంగా సమసిపోయే దాకా ప్రతి రాజకీయ పార్టీ స్పందించాలని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈమేరకు శనివారం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఉద్దానం బాధితుల సమస్యను సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని.. మున్ముందు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి దోహదపడే ఇతర అంశాలపైనా పోరాటం సాగిస్తామని, సమస్యలను వెలుగులోకి తెస్తామని స్పష్టం చేశారు. కిడ్నీ బాధితుల సమస్యను వెలుగులోకి తెస్తూ.. వారికి తోడ్పాటును అందిస్తున్న మీడియాకు పవన్ కృతజ్ఞతలు చెప్పారు. మున్ముందు కూడా ఇదే సహకారం, తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.