సినీ హీరోలు బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, ప్రభాస్ ఇలా అందరూ బాగుండాలి అని కోరుకుంటాను అని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా... అభిమానులు 'ఓజీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో, పవన్ సినిమాల గురించి కాసేపు మాట్లాడారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమని ఆయన అన్నారు.
ముందు యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని... ఆ తర్వాతే విందులు, వినోదాలు అని వ్యాఖ్యానించారు. సినిమాలలో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని బూతులు, శాపనార్థాలు తప్ప నీటి సమస్య గురించి పట్టించుకోలేదన్నారు. గుడివాడలో 43 గ్రామాల్లో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే రాము తన దృష్టికి తీసుకొచ్చారు, వెంటనే గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను అని తెలిపారు.
అదేసమయంలో అధికారాలు ఒకటి గుర్తు పెట్టుకోవాలని, ఇది జగన్ ప్రభుత్వం కాదు దోచుకోవటానికి, దాచిపెట్టుకోవడానికి.. మీరు ఎంతా నిజాయితీగా ఉంటే మీ భవిష్యత్తు అంతా బాగుంటుందని, ప్రతి ఒక్క రూపాయి లెక్క చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ సుతిమెత్తగా హెచ్చరించారు.
అలాగే, తన పేరు వాడుకున్న అధికారి ఘటన తెలిసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనే దానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. అధికారి తన పేరుతో లంచాలు ఆశించడం.. ఈ విషయాన్ని ప్రజలు మా డిప్యూటీ సీఎం పేషీకి తీసుకురావడంతో ఆ అధికారిపై చర్యలు తీసుకొని, ఆ అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.