జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రి భీమవరంలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పెత్తందారీ విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చూపెట్టారని.. తనను పెత్తందారీ అనేందుకు ఆయనకు అర్హతే లేదన్నారు.
రైతులకు లాభసాటి ధర కాకున్నా గిట్టుబాటు కూడా ఇవ్వట్లేదని.. తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్ 32మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే.. ఎందుకు పట్టింకోరని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆక్వా దాణా ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని పవన్ ధ్వజమెత్తారు.
చిల్లర మాటలు మాట్లాడనని.. తన వ్యక్తిగత జీవితం గురించి సీఎం మాట్లాడుతున్నారు. సీఎం జగన్ జీవితంలో అణువణువూ తనకు తెలుసునని.. సీఎం హైదరాబాదులో ఏం చేశారో తనకు బాగా తెలుసునని చెప్పారు.
జగన్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలంటే.. ఓ వ్యక్తిని తన వద్దకు పంపాల్సిందని పవన్ ఎద్దేవా చేశారు. ఆ విషయాలు వింటే చెవుల్లోంచి రక్తం వస్తుందన్నారు. తాను సంస్కారం లేకుండా మాట్లాడనని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినా అవి వెంట్రుకలతో సమానం అంటూ మండిపడ్డారు.