జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సినిమాల్లో హీరో అయిన పవన్.. నిజ జీవితంలో ఓ పెద్ద కంత్రీ అంటూ మండిపడ్డారు. గురువారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ, హల్లో ఏపీ.. బైబై వైసీపీ అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న నినాదంపై సరిగా లేదున్నారు. హల్లో ఏపీ.. నా పార్టీని అమ్మేశాను అని నినందింస్తే చాలా బాగా ఉంటుందని ఆయన తెలిపారు.
స్థిరత్వం లేని ఆయన రాజకీయాలకు పనికిరారని అన్నారు. పవన్ కల్యాణ్ గళం గరళమని, ఆయన ఎక్కిన తర్వాత వారాహి వాహనం వరాహమైందన్నారు. నారా లోకేశ్ చేపడుతున్న యువగళానికి గళం లేదన్నారు. యువగళంలో విద్వేషాలను రెచ్చగొడితే సహించేది లేదని అంబటి హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలైతే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా కానుక, పింఛను కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పోతాయన్నారు. పోలవరంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గైడ్‌బండ్ విషయం ప్రమాదకరం కాకపోయినా 'ఈనాడు' తప్పుడు కథనాలు రాస్తోందని మంత్రి అన్నారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర తుస్సు యాత్ర అని విమర్శించారు.