Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా : హీరో పవన్ కళ్యాణ్

Advertiesment
pawan kalyan
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (14:53 IST)
మంగళగిరి వేదికగా వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరోమారు ప్యాకేజీ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, ఆయన చెప్పు కూడా చపించారు. 
 
మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నేతల వ్యాఖ్యలపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. 
 
'గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. గత 8 ఏళ్లలో నేను 6 సినిమాలు చేశా. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల ఆదాయం సంపాదించా. రూ.33 కోట్లకు పైగా పన్నులు చెల్లించా. నా పిల్లల పేరిట ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కోసం ఇచ్చాం. 
 
రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.12 కోట్లు.. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.30 లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన నాటి నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.15.58 కోట్ల కార్పస్‌ఫండ్‌ విరాళాలు వచ్చాయి. కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ.3.50కోట్లు వచ్చాయి. 'నా సేన కోసం నా వంతు'కు రూ.4 కోట్లు అందాయి.
 
ఇంకోసారి ప్యాకేజీ అంటే మర్యాదగా ఉండదు.. చెప్పు తీసుకుని కొడతా. వైకాపా గూండాల్లారా.. ఒంటి చేత్తో మెడ పిసికేస్తా. ప్యాకేజీ అని ఎవరైనా మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతా. ఇంతకాలం నా సహనం మిమ్మల్ని కాపాడింది. నేను అందరినీ గౌరవిస్తా.. కానీ, అవతలి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 
 
నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదేపదే మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొకరిని చేసుకున్నా. చట్ట ప్రకారం వారికి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చా. 
 
వైకాపాతో యుద్ధానికి నేను సై. రాడ్లతోనా? హాకీ స్టిక్కులతోనా? దేనితో వస్తారో రండి.. తేల్చుకుందాం. ఇప్పటివరకు నా సహనం చూశారు. నా భావ ప్రకటనను నేను స్వేచ్ఛగా ప్రకటిస్తున్నా. ఇవాళ్టి నుంచి యుద్ధమే.. మీరు రెఢీనా? వైకాపాలోని అందరూ నీచులని అనట్లేదు.. కానీ ఆ పార్టీలో నీచుల సమూహం ఎక్కువ. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా? 
 
కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధం. ఈ పోరాటం నా గుండెల్లో ఎలా ప్రవేశించిందో తెలుసా? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని నేను ఊరికే చెప్పలేదు. పల్నాటి బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పా. 
 
మాల కులానికి చెందిన కన్నమనాయుడిని సైనికాధిపతిని చేశారు. అన్ని కులాలు సమానమని చెప్పేందుకు చాపకూడు సిద్ధాంతం తెచ్చారు. అధికారం ఒకటి, రెండు కులాలకే పరిమితమైంది. అణగారిన, వెనుకబడిన వర్గాలకు అధికారం కావాలి. చాలా కులాల్లో జనాభా ఉన్నా అధికారం రాలేదని బాధపడుతున్నారు. వైకాపాలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోండి.. కానీ కాపులను మాత్రం లోకువ చేయొద్దు అని పవన్‌ కళ్యాణ్ తనదైనశైలిలో హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. డిగ్గీరాజా