విశాఖపట్టణం గడ్డపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టగానే మూడు ముక్కలాట కోసం వైకాపా మంత్రులు తలపెట్టిన గర్జన గాల్లో కలిసిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, జైలు కూడు రుచి చూసిన జగన్మోహన్ రెడ్డి ఇపుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ జైలుకు పంపించాలని భావిస్తున్నారని ఆరోపించారు.
విశాఖ పర్యటనలో హీరో పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు హుందాగా ప్రవర్తించలేదన్నారు. అదేసమయంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండబోదని, ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.
వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన తుస్సుమందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో అడుగు పెట్టిన వెంటనే విశాఖ గర్జన గాల్లో కలిసిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆ అక్కసుతోనే జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు హుందాగా వ్యవహరించడం లేదని... ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
మరోవైపు, విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి అరెస్టు అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ.10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.