ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే అని.. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు.
మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు. అయినా ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని మండిపడ్డారు.
మహిళల మాన మర్యాదలకు భంగం వాటిల్లే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్నాయని.. పాలకులు పట్టించుకోకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
దిశా చట్టాలు చేశాం, పోలీస్ స్టేషన్లు పెట్టామని ప్రచార ఆర్భాటం తప్ప ఆడ బిడ్డకు మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర పాలకుడు ఇంటికి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు.