Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓసారి విరిగిన చేతితో.. మరోసారి మోకాలి గాయంతో ఆడిన విహారి... పవన్ కళ్యాణ్ సంఘీభావం

Advertiesment
pawan kalyan

వరుణ్

, మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (17:46 IST)
భారత క్రికెటర్ హనుమ విహారి కేంద్ర బిందువుగా ఆంధ్రా రంజీ క్రికెట్ వివాదం ముదిరిపాకాన పడింది. అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పయిన హనుమ విహారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఏపీలోని అధికార వైకాపా పార్టీ నేత కుమారుడి కోసం విహారి జీవితంతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కంటే.. వైకాపా నేత గొప్పనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైకాపా కార్పొరేటర్ కారణంగానే విహారి తన కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించాల్సి వచ్చిందన్నారు. భారత క్రికెటర్, ఆంధ్రా రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ కంటే ఎటువంటి క్రికెట్ నేపథ్యం లేకుండా స్థానిక వైకాపా నాయకుడే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు చాలా విలువైన వ్యక్తిగా మారడం ఎంత అవమానం అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ సుధీర్ఘ ట్వీట్ చేశారు. భారత క్రికెట్ జట్టుకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు సాధించిన విహారి... ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో కనబరిచిన పోరాట పటిమ మరువలేనిది అని కొనియాడారు. ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్‌గా గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు ఐదుసార్లు నాకౌట్ దశకు అర్హత సాధించడంలో హనుమ విహారి పాత్ర ఎంతో ప్రముఖమైనదని వివరించారు.
 
ఓసారి విరిగిన చేతితో ఆడాడు... మరోసారి మోకాలి గాయంతో ఆదాడు... భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రా రంజీ టీమ్ కోసం తన క్రీడాశక్తినంతటినీ ధారపోశాడు అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. "జగన్ మోహన్ రెడ్డి గారూ... మన ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్‌ను రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉపయోగం ఏంటి?" అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.
 
"ప్రియమైన హనుమ విహారి గారూ... మీరు దేశానికి, రాష్ట్రానికి చాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో ఆంధ్రాలోని చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి, క్రీడాకారులను ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగువారిగా, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా... మీకు జరిగిన అన్యాయానికి, మన రాష్ట్ర క్రికెట్ సంఘం మీ పట్ల వివక్ష చూపిన తీరుకు మేం చింతిస్తున్నాం. మీకు భవిష్యత్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే... ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన రాష్ట్ర క్రికెట్ సంఘంతో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను విశ్వసిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని రైతులకు భారీ ఊరట... జగన్ సర్కారు నోటీసులు కొట్టేసిన హైకోర్టు