వైకాపాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీని వీడారు. ఆయన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కొత్తపల్లి కొత్తగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన సేవలు పార్టీకి ఎంతో ఉపయోగకరం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడి అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుందని అన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా పనిచేసిన కొత్తపల్లి, అనంతరం వైసీపీలో చేరారు. ఇటీవలే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన, సోమవారం మంచి రోజు కావడంతో పార్టీలో చేరారు. అయితే, ఈయన వచ్చే ఎన్నికల్లో నరసాపురం సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన మలి జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశాలున్నాయి.
కాగా, టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొత్తపల్లి సుబ్బారాయుడు గత 1989, 1994, 1999, 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన ఆయన... అప్పటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2019లో ఆయన వైసీపీలో చేరారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా వైసీపీకి దూరమైనట్టు తెలుస్తోంది.